దళిత కవితా పోరు పతాక జాషువా

దళిత కవితా పోరు పతాక జాషువా

కలేకూరి ప్రసాద్

జాషువా పుట్టిన నూరేళ్ళ తర్వాత, తన అస్తిత్వాన్ని తాను అన్వేషించే క్రమంలో దళితప్రపంచం జాషువాను గుండెలకు హత్తుకొంటున్నది. ఆయన అక్షరాలను స్పృశిస్తే ఆవేదనా,ఆగ్రహం కలగలిసిన కన్నీటి కణికలు జలజలా రాలుతాయి. బతుకొక సముద్రమై అలల అక్షరాలనధిరోహించి గుండె చెలియలికట్ట పైన తనను తాను ఆవిష్కరించుకొంటుంది.కవిత్వమొక 'పెనుగులాటై జీవితాన్ని ధరించి సమతాకాంక్షల పరిమళాన్ని వెదజల్లుతుంది.తన కవిత్వం గురించి జాషువా గారే చెప్పుకొన్నట్లు 'సలసల కాగి చిందిన కన్నీటి బిందువులు” ఆయన కవితలు.

Gurram Jashuva

దళిత ఆకాంక్షలను వ్యక్తీకరించడానికి తన గొంతుకనిచ్చి శిఖరాగ్రస్థాయిలో దళిత జీవన స్వప్నాలనూ, ఆవేదనలనూ, సంఘర్షణనూ తన కవిత్వంలో దృశ్యీకరించాడు.మాదిగతల్లి లింగమాంబకు, గొల్లతండ్రి వీరయ్యకు 1895 సెప్టెంబర్‌ 28వ తేదీన పుట్టిన గుర్రం జాషువా 1971 జూలై 24వ తేదీన చనిపోయేంతవరకూ మనిషిగా, కవిగా జీవితాంతం పెనుగులాడాడు. తెలుగు సమాజం ఆయనను కవిగా తిరస్కరించింది. అనేక అవమానాలమధ్య, అవహేళనల మధ్య, తిరస్కారాల మధ్య దుర్భర దారిద్ర్యం మధ్య ధిక్కారమే జవాబుగా జాషువా కవితా జీవితప్రస్థానం కొనసాగింది. వెయ్యేళ్ళ తెలుగు సాహితీ చరిత్రలో మొట్టమొదటి సారిగా అంటరాని మానవుణ్ణి కధానాయకుణ్ణి చేసి గబ్బిలం కావ్యం రాయడం ద్వారా దళిత కవితా పోరుపతాకాన్ని తెలుగు గడ్డమీద ఆయన సగర్వంగా ఎగురవేశాడు.


ఒక మనిషికి ఒకే విలువను ఇవ్వక, కొందరిని దైవ సమానులుగా, కొందరిని పశువులకన్నా హీనులుగా చూస్తోన్న దుర్మార్గపు సామాజిక రాజనీతిని నిలువెల్లా ధిక్కరిస్తూ కలం పట్టిన జాషువా తనకు ఇద్దరు గురువులని చెప్పుకున్నాడు. మొదటి గురువు పేదరికమైతే,రెండవ గురువు కుల మతభేదం. మొదటిది తనకు సహనాన్ని నేర్చితే రెండవది ఎదిరించే శక్తిని నేర్పిందని ఆయన రాసుకొన్నాడు. ఇది అక్షరాలా నిజం. ఆ స్వీయానుభవంతో లోకాన్ని చదివిన జ్ఞానంతో గుండెల్లో మంటలు రేగే ఆ అనుభూతితో ఆయన తన కవితా యాత్రను కొనసాగించాడు. ఆయన రసం కరుణవీరం. అడుగడుగునా అవమానిస్తోన్న సమకాలీన సమాజంపై నిరంతర పోరాటంగా ఆయన తన సాహితీ సమరాన్ని సాగించాడు.


ఆయన కవిత్వం విన్న ఒక వైష్ణవ పూజారి 'కవితలల్లిన అంటరాని వాడిని నరికినను సమంజసమేనని పురాణాలు ఘోషిస్తున్నా యన్నాడు. ఒక రైలు ప్రయాణంలో జాషువా కవిత్వం విన్న ఒక పెద్దమనిషి ఆ కవితల సొగసుకు మురిసిపోయి మెచ్చుకున్న తర్వాత జాషువా కులం అడిగి తెలుసుకొని ఛీఛీ సరస్వతి అంటు పడిందని ఛీత్కరించుకొని లేచిపోయాడు.

ఆ సంఘటనను జాషువా

“నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపరే

ఖా కమనీయ వైఖరుల గాంచి భళీ భళి యన్నవానీ

దే కులమన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో

బాకున గ్రుమ్మినట్లుగును ప్రార్ధివ చంద్ర! వచింప సిగ్గగున్‌”

అని వివరించాడు.ఇట్లా గుండెల్లో ఎన్నో బాకు పోట్లతో జాషువా కవిత్వం రక్తసిక్తమయింది.


1943 కాకినాడ సాహితీ సభలో త్రిపురనేని రామస్వామి చౌదరి, కాటూరు వెంకటేశ్వరరావు ప్రభృతులతో పాటు జాషువాని ఆహ్వానించారు. అయితే వేదికపై అందరితోపాటు కుర్చీ వేయకుండా జాషువాకు దూరంగా వేశారు. అంతేకాక ఆయనను మైకు ముందుకు ఆహ్వానించడానికి ఇప్పుడు గుర్రం జాషువా పంచమస్వరంలో తన కవిత్వాన్ని వినిపిస్తాడు అని ప్రకటించారు. అంటే జాషువా అంటరానివాడు అని మైకు ముందు ఏ మొహమాటమూ లేకుండా ప్రకటించడమే. అయితే జాషువా ఈ అవమానాలతో క్రుంగిపోయి కన్నీటి సముద్రంలో మునిగిపోయి అస్త్ర సన్యాసం చేయలేదు. ద్విగుణీకరించిన ఆత్మవిశ్వాసంతో తన ఆత్మగౌరవాన్ని ప్రకటించుకొన్నాడు. అదే సభలో


“గవ్వకు సాటిరాని పలుగాకులు మూకలసూయచేత న

న్నెవ్విధి దూరినన్‌ నను వరించిన శారద లేచిపోవునే?

యివ్వసుధా స్థలిన్‌ బొడమరే రసలబ్ధులు గంటమూనెదన్‌

రవ్వలు రాల్చెదన్‌ గరగరల్‌ పచరించెద నాంధ్రవాణికిన్‌”

అని కవిత్వం చదివి సభలోని వాళ్ళ నోళ్ళు మూయించాడు. సమాజం అన్ని విధాలా అవమానిస్తూ ఎంతో సామాజిక బాధ్యతతో దేశానికి, పేదలకి, దళితులకీ, స్త్రీలకీ, వేలాడుతున్న సంకెళ్ళను ఛేదించడానికి తన కవితాకరవాలాలను విసిరాడు.


“వాని రక్తంబు నాహరించి

ఇనుప గజ్జెల తల్లి జీవనము సేయు

కసరి బుసగొట్టు నాతని గాలిసోక

నాల్గు పడగల హైందవ నాగరాజు”


అంటూ వర్ణాశ్రమ ధర్మాల హైందవ కుల వ్యవస్థ నీడల్లో దళితుడి దయనీయమైన పరిస్థితిని వివరించాడు.


“వాని రెక్కల కష్టంబు లేనినాడు

సస్యరమ పండి పులకింప సంశయించు

వాడు చెమ్మటలోడ్చి? ప్రపంచమునకు

భోజనము పెట్టువానికి భుక్తిలేదు”


అంటూ జాషువా హిందూ సమాజంలో ఎవరైతే అంటరానివారో, వారే ఈ దేశంలోని సకల సంపదలకూ పునాదిగా వుండి, సృష్టికర్తలై వుండి తాము మాత్రం తింటానికి తిండిలేకుండా వున్నాడన్న దుర్మార్గపు వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రించాడు.


*ఎవడారగించు నమృతభోజనంబున

గలిసెనో యీ లేమ గంజిబువ్వ

ఎవడువాసము చేయు శృంగార సౌధాన

మునిగెనో యిన్నారి పూరిగుడిసె

ఎవని దేహము మీది ధవళాంబరములలో

బొసగెనో యిన్నాతి ముదుక పంచె

ఎవడు దేహము సేర్చు మృదుతల్పముల లోన

నక్కెనో యీ యమ్మ కుక్కిపడక

వసుధపైనున్న భోగసర్వస్వమునకు

స్యామత వహించి మనుజుండు ప్రభావ మందు

ఎవడపహరించె నేమయ్యె నీమెసుఖము

కలుషమెరుగని దీని కొడుకుల సుఖంబు?*


తలలు బద్దలయ్యే ఈ ప్రశ్నలను అనాధ దళిత స్త్రీని వర్ణిస్తూ జాషువా ఎక్కు పెట్టారు.జాషువా అనాధ కేవలం దళిత స్త్రీ కాదు. ఆమె బహిష్కృత భారతమ్మ. ఆయన వేసిన ప్రశ్నలు భేతాళ ప్రశ్నలు. సమాధానం తెలిసీ చెప్పకపోతే తల వేయి వ్రక్కలవుతుందని నిలదీస్తాయవి.


శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు రాయకముందే

“ఒకడు చిన్నమ్మ కరడోలనూగుచుండ

నొకడు పెద్దమ్మ కటిక దృష్టికి దపించు

ప్రకృతి జనయిత్రి యనుగు గారాల సుతుల

నొకని ద్వేషించు నొకని అభ్యుద్ధరించు”

అని జాషువా రాశాడు.


ఒక వైపు హైందవ దురాచారాలను ఎండగడుతూ అంటరానితనాన్ని నిరసిస్తూ,జనసామాన్యాన్ని దుర్భర దారిద్ర్యంలోకి నెట్టివేసిన దోపిడీని తునుమాడుతూ మరోవైపున స్త్రీల బానిసత్వాన్ని నిరసిస్తూ ఆయన రచనలు చేశాడు.


“అబలయన్న బిరుద మంటించి, కాంతల

స్వీయశక్తుల నదిమి చిదిమినారు

సబలయన్న బిరుదు సాధించి హక్కుల

గడన చేసికొమ్మ కష్టచరిత”


అని స్త్రీలు తమ అణచివేతలపైన తామే పోరాడి సబలలుగా హక్కుల్ని సాధించుకోవాలని ప్రబోధించాడు. ఆయన రచనల్లో స్త్రీలు ధీరోధాత్తులు. ఖడ్గక్కనకు బుద్ధిచెప్పిన ఆయన భార్య 'వీరచానమ్మ అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ '“వీరకుమారి” వాలెంతీను తెరష్కోవ, ఇలా ఆయన రచనల్లో స్త్రీలందరూ రక్తమాంసాలతో, సొంత వ్యక్తిత్వాలతో వుంటారు.

జాషువా కవిత్వం రాస్తున్న రోజులలోనే ఒకవైపున కవి సామ్రాట్‌ విశ్వనాధ సత్యనారాయణ, మరోవైపు రాయప్రోలు, కృష్ణ శాస్త్రి రచనలు చేస్తున్నారు. విశ్వనాధ సత్యనారాయణ ఈ దేశంలో వర్ణాశ్రమ ధర్మం చెక్కుచెదరకుండా ఉండాలనీ, భగవంతుడు ఏయే వర్జాలవారికి ఏయే విధుల్ని కేటాయించాడో, ఆయా విధుల్ని తప్పకుండా నిర్వహించాలని త్రికరణ శుద్ధిగా నమ్మి నిర్మాహమాటంగా, నిష్కర్షగా తన రచనలు సాగించాడు. ఆయన రచనల్లో దళితులు సైతం ధర్మ పరిరక్షణ కోసం పరితపించిపోతారు. అందరికీ సేవచేయడం తమ హక్కుగా భావించి ఆ హక్కుకు భంగం కలిగితే బాధపడతారు. ఆరు నూరైనా భగవంతుని ఆదేశానుసారం వ్యవస్తీకృతమైన కులవ్యవస్థ ఉండాల్సిందేనని, అందుకోసమే విశ్వనాధ రచనలు సాగించాడు.


ఇంకోవైపు నండూరి సుబ్బారావు, కృష్ణశాస్త్రి భావకవితార్సురిలో ఊహాప్రేయసుల, ఊహావియోగాల, ఊహావిరహాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అటు సంప్రదాయ ధోరణినీ ఇటు భావకవితా ధోరణిని సునిశితంగా జాషువా పరిశీలించాడు. నన్నయ్య,విశ్వనాధల ధోరణితో ఇబ్బందులేవి లేవు, యుద్ధమే. భావ కవితా ధోరణి చూడటానికి సంకెళ్ళ పైన తిరస్కారం, స్వేచ్చ అంటే ప్రేమ కనబరుస్తున్నట్టుంది. వారి అంతర్ముఖత్వాన్ని శక్తివంతమైన దుఃఖాన్నీ జాషువా జాగ్రత్తగా పరిశీలించాడు. వారిలో స్వేచ్ళంటే ప్రేమ,ఆదరాభిమానాలు, స్పందన గానీ, వారి విషాదంలో పీడిత జనాంగం కోసం ఒక్కకన్నీటిచుక్కగానీ కన్పించలేదు ఆయనకి.


'పూతోటల మదచుంబర,

నాదముల విలాసవతుల నడచెడుగులనా

హ్లాదించు కవులకే నిరు

పేదల ఆక్రందనములు వీనులబడునా?

అన్నసందేహం వచ్చింది.


“ఎవతుక కోసమో కుమిలి ఏడ్చుచు చిక్కని తెల్లుకైత కా

యువులు కుదించి ఏమిటి కయోను యముననే

పొనరిందునీవు? నీ

కవనము పాడుగాను! వెడగా ఇక నేనియు రమ్ము దారికిన్‌!

అని భావకవిని హెచ్చరించాడు.


తెలుగు గడ్డ మీద వీరవిహారం చేస్తున్న ధోరణులను ఎద్దేవా చేసి ఇకనైనా జీవితంపునాదిగా, దేశ భవిష్యత్తు ప్రయోజనకరంగా రచనలు సాగించాలని ప్రబోధించాడు.


“ప్రణయ కవి ఒకండు షాషాణకవి యొక్క

దేడ్చుకవి యొకండు నేక మగుచు ఊ

రొండొరులను చూచి ఓదార్చుకొనుచున్న

బాగుపడునె భావి భరతజాతి!

అని నిలదీశాడు. ప్రణయ కవి నండూరి, పాషాణ కవి విశ్వనాధ, ఏడ్పు కవి కృష్ణశాస్త్రి వీళ్ళందరు సాహిత్యాన్ని ప్రజలకోసం సృష్టించడం లేదని అట్లా చేయవలసి వుందనీ జాషువా అభిప్రాయం. ఇట్లా దేశ, పీడిత, దళిత, స్రీజాతుల శృంఖలాలను ఛేదించడానికి 'పెడధోరణులను ఖండించడానికి కవిత్వం రాసిన జాషువాను తెలుగు సాహితీ చరిత్ర అంటరానివాడిగానే చూసింది.


ఎవడి మెప్పుకోసమో కాక నిర్మొహమాటంగా జీవిత వాస్తవికతను చిత్రించినందుకూ, దళితుడిగా పుట్టినందుకూ జాషువాను ఆనాటి నవ్య సాహిత్య సమితి దూరంగా వుంచింది.కవిత్వం అంటానికి వాళ్ళ ప్రమాణాల్లోనే వీలులేని ఎందరో కవుల కవితలను సంకలనం చేసిన ముద్దుకృష్ణ తన వైతాళికులు సంకలనంలో జాషువాను వెలివేశాడు. సమాజం పట్లా, జీవితం పట్లా నిబద్ధత లేని సాహితీవేత్తలూ, ధోరణులు జాషువాను నిర్లక్ష్యంచేశాయంటే దాని అర్ధం చేసుకోవచ్చు. కానీ సామాజిక మార్పును తమ లక్ష్యంగా ప్రకటించుకొని ఎన్నెన్నో త్యాగాలను చేయడానికి సిద్ధపడిన అభ్యుదయ విప్లవ సాహిత్యోద్యమాలు కూడా జాషువాను అంటరానివాడిగానే చూశాయి. అసలు ఆయన ఉనికిని గుర్తించకపోవడమో, గుర్తించినా ఏవో ఛంధస్సులో పద్యాలు రాసిన అంటరాని వాడిగా చూడ్డమో చేశాయి. ఇది నిజంగా

బాధాకరమైన అంశం. కమ్యూనిస్టు ఉద్యమం అంబేద్కర్‌ని ఎలా వెలి వేయడానికి ప్రయత్నించిందో, కమ్యూనిస్టు సాహిత్యోద్యమాలు జాషువాను అలాగే వెలివేసే ప్రయత్నం చేశాయి.


మహాకవిగా పేరు ప్రఖ్యాతులు పొంది కష్టజీవికి అండగా నిలబడతానన్న శ్రీశ్రీ తాను నిరసించే భావకవితా ధోరణిని పరాకాష్టకు తీసుకువెళ్ళిన కృష్ణశాస్త్రి కవిత్వాన్ని ఇది ఇక్షుసముద్రం అందరూ ఆస్వాదించండి అని సిఫారసుచేశాడు. అదే శ్రీశ్రీ తాను ఏ పీడితుల పక్షపాతినని ప్రకటించుకున్నాడో ఆ పీడితుల్లో పుట్టి, స్వంత గాయాలతో స్వంత ఆవేదనతో,స్వంత ఆగ్రహంతో కవితాజ్వాలల్ని సృష్టించిన జాషువాను తన 'వ్యూలు రివ్యూలు” లో

ద్వితీయశ్రేణి కవిగా పేర్కొన్నాడు. దీని వెనుక 'కులం ఆడిన సయ్యాట స్పష్టంగా వుంది.

ఈ నిర్లక్ష్యానికి ఎంతో ఆవేదన పడిన జాషువా,


'ఎంత కోయిలపాట వృధాయయ్యెనో కదా! చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా! కటిక, కొండలమీద మిటకరించి ఎన్ని కస్తురి జింక లీడేరెనో కదా! మురికి తిన్నెలమీద పరిమళించి ఎన్నిముత్తెపు రాలు చిన్నమయ్యెనో కదా! పండిన వెదురుజొంపములలోన ఎంత గంధవహనమెంత తంగెటి జున్ను ఎంత రత్నకాంతి ఎంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరానిచోట బుట్టు కతన”

అని రాసుకున్నాడు. 

ఇందుకు తెలుగు సాహితీ చరిత్ర సిగ్గుతో తలవంచు కోవాలి.జాషువాను హృదయానికి హత్తుకోలేని సాహితీ చరిత్ర ఆత్మహత్య చేసుకోవాలి.


Report Page