స్త్రీవాదం నిరంతర ప్రవాహం

స్త్రీవాదం నిరంతర ప్రవాహం


స్త్రీల అనుభవాలను, అనుభూతులను స్త్రీల దృక్కోణం నుంచి స్త్రీలే వర్ణించాలన్న ఆలోచనా విధానంతో దూసుకువచ్చిన సాహిత్య ధోరణి- ‘స్త్రీవాద సాహిత్యం’. చేకూరి రామారావు అన్నట్టు స్త్రీవాదం ఓ ఉప్పెన, ఓ ప్రపంచ దృక్పథం, ఓ సామాజిక సిద్ధాంతం. స్త్రీ తరఫున ఆలోచించగలిగే వారంతా స్త్రీవాదులే! స్త్రీవాదం అనేది పురుషాధిక్యతపై నిరసన గానీ పురుషులపై కాదు. తెలుగునాట స్త్రీవాద సాహిత్యం ఎప్పుడు ఎలా మొగ్గతొడిగింది.. ఎలా విస్తరించింది.. ప్రస్తుతం ఏ బాటలో పయనిస్తోంది చూద్దాం!

సమస్యాత్మకంగా మారిన వివక్షలను దీటుగా ఎదుర్కొనే ప్రయాణంలో వెలువడ్డ కొన్ని వాదాల్లో ప్రముఖమైందే స్త్రీ వాదం. తమవైన భావాలను, తమదైన భాషాశైలిలో స్వేచ్ఛగా ప్రకటించారు స్త్రీవాదులు.


స్వాతంత్య్రానంతరం దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న అనేక విపరిణామాల కారణంగా కుటుంబ జీవితాల్లోకి వరకట్నం ప్రవేశించింది. ఆ దురాచారం వేళ్లూనుకుంటున్న దశలోనే స్త్రీవిద్య, ఉద్యోగాల ప్రాధాన్యాన్ని సమాజం గుర్తించటం ప్రారంభమైంది. క్రమంగా అంతర్జాతీయ మహిళా సంవత్సరం (1975) వరకు స్త్రీలు ఉద్యోగాలు చేయటం సామాజిక, కుటుంబ ఆర్థిక అవసరంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే స్త్రీలలో వ్యక్తిత్వవికాస కాంక్ష, ఆర్థిక స్వాతంత్య్రేచ్ఛ మొగ్గతొడిగాయి. స్త్రీల మనోభావాలను అర్థం చేసుకోవటానికి, సమస్యలను పరిష్కరించుకోవటానికి స్త్రీవాద దృక్పథం నుంచి రచనలు వెలువడ్డాయి. కట్టమంచి ‘ముసలమ్మ మరణం’, గురజాడ ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మా’, రాయప్రోలు ‘స్నేహలత’, శివసాగర్‌ ‘చెల్లి చంద్రమ్మా’ తదితర రచనలు అప్పటికే సామాజిక పరిణామానికి సాక్ష్యాలుగా నిలిచాయి..


 1975 నుంచి నేటి వరకు వెలువడిన, వెలువడుతున్న స్త్రీవాద రచనల్లో స్త్రీల ఉద్యోగం, వివాహం, సంతానం, కుటుంబ హింస లాంటి ఇతివృత్తాలు కనపడతాయి. ఆయా రచయిత్రులు తమ పాత్రల ద్వారా ఓ చైతన్యాన్ని, సమస్యా పరిష్కార తత్వాన్ని ప్రదర్శించారు. తద్వారా సమాజంలో గుణాత్మకమైన మార్పులకు తమ వంతు సాయం చేశారు. ‘‘ఎవరూ మరొకరి అనుభవాన్ని అనుభవించాల్సిన పని లేదు/ ఎవరూ నామవాచకాన్ని సర్వనామం చేయనక్కర లేదు’’ అంటూ ధిక్కార స్వరంతో ‘రహస్యోద్యమిం’చిన కవి త్రిపురనేని శ్రీనివాస్‌. 1980వ దశకంలో వాయువేగంతో దూసుకువచ్చిన స్త్రీ, దళిత, మైనారిటీ, ప్రాంతీయ వాదాలకు ‘‘ఎవరి రక్తచలనంతో వారు ఖడ్గచాలనం చేయాలి’’ అంటూ కావాల్సిన ఊతమిచ్చారాయన. 1980 తర్వాత తెలుగు సాహిత్యం స్పష్టమైన మలుపు తిరిగింది. పాతివ్రత్యం, సిగ్గు, బిడియం, అపనిందలు, అవమానాలు లాంటివి స్త్రీని ఒక వ్యక్తిత్వం గల మనిషిగా పెరగనివ్వకుండా అడ్డుకున్న నిరోధాలు. వీటిని తోసిరాజంటూ స్త్రీలు తమ అనుభవంలోకి వచ్చిన ఏ విషయంపైనైనా సరే.. నిర్భయంగా, స్వేచ్ఛగా రాయడం ప్రారంభించారు. జీవిత సత్యాన్ని తెలుసుకోవటానికి ఎవరి అనుభవం వారికి ఆధారం కావాల్సిందేనన్న విషయాన్ని స్త్రీవాదులు వెలుగులోకి తెచ్చారు. అలాంటి వారిలో ఓల్గా, వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, పి.సత్యవతి, సి.సుజాత, విమల తదితరులు ప్రముఖులు.


సావిత్రి నుంచి ఓల్గా వరకూ

సావిత్రి రాసిన ’ఈ దేశంలో ఇదో వర్గం’ కథ తొలిసారి స్త్రీ సమస్యలను స్త్రీనే చెప్పుకున్నదానికి నాంది. తర్వాత ఇల్లిందల సరస్వతీదేవి ‘పెళ్లికూతుళ్లు’ నవలలో వివాహ వ్యవస్థ ఎలా ఉండాలనే విషయాన్ని తన పాత్రలైన కాంచనలత, పద్మలతలతో చర్చకు పెట్టించారు. వైవాహిక జీవితంలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన గౌరవం ఉండాలని ఆకాంక్షించారు. వాసిరెడ్డి సీతాదేవి రచించిన ‘వైతరణి’ నవల, ఆస్తిహక్కు లేక స్త్రీల జీవితం నరకప్రాయంగా మారుతోందనే విషయాన్ని వ్యక్తపరుస్తుంది. జొన్నలగడ్డ లలితాదేవి ‘అగ్నిపుత్రి’ నవల.. లైంగిక దోపిడీకి బలయ్యే స్త్రీల వ్యథలను కళ్లకు కడుతుంది.  


స్త్రీవాద కథా పరిణామంలో ఎనభైలు ఎవరి అనుభవాల్ని వారు ప్రకటించటానికి కావాల్సిన బలాన్ని, అందుకు కావాల్సిన శిల్ప చాతుర్య మెలకువలను అందించాయి. తొంభైల్లో తెలుగు కథ ఒక విస్ఫోటనానికి గురయ్యింది. ఒక వైపు స్థానిక ప్రేరణలు, మరొక వైపు విశ్వ భావనలు చుట్టుముట్టి కథకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో అక్షరాస్యత వల్ల స్త్రీ జీవితంలో మానవ సంబంధాలు విస్తృతం అవుతాయని, ప్రపంచ జ్ఞానం వికసిస్తుందని స్త్రీవాదులు తీవ్రంగా విశ్వసించారు. సామజిక ఉద్యమకారిణి, హేతువాది, ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ గారు రాసిన 'ఇస్లాం - స్త్రీలు', 'క్రైస్తవం - స్త్రీలు', 'హైందవం - స్త్రీలు' అనే మూడు గ్రంథాలు మతం వల్ల స్త్రీలకు ఎదురయ్యే పరిణామాలను కుండ బద్దలు కొట్టినట్లుగా వివరిస్తాయి.



   వివాహ వ్యవస్థలో విడాకులు ఎంత సహజమో, స్త్రీ పునర్వివాహమూ అంతే సహజమని ‘వివాహ బంధం’లో డా।। విజయ పాత్ర ద్వారా డి.కామేశ్వరి సమర్థవంతంగా చెప్పగలిగారు. పునర్వివాహపు హక్కులను పొందటంలో స్త్రీపురుషుల మధ్య లింగ వివక్ష తగదంటూ ఇంద్రగంటి జానకి ‘మాతృబంధం’ నవలలో ఎలుగెత్తారు. ఆ సమయంలోనే ఓల్గా స్త్రీ దృక్పథాన్ని తనదైన శైలిలో సృజించే ప్రయత్నం చేశారు. ఆమె కథా సంపుటులైన ‘రాజకీయ కథలు’ (1993), ప్రయోగం’ (1995).. స్త్రీలో సహజంగా ఉండే భావుకత, కళాత్మకతలను, సున్నితమైన హృదయాన్ని ఆవిష్కరించాయి. కథాశిల్పంలోనూ, కథనంలోనూ ఓల్గా మీద కొడవటిగంటి కుటుంబరావు, చలం భావాల ప్రభావం చాలా ఉంది. అయితే చలం.. మానవ సమస్య ఏదైనా, ఎవరిదైనా వారి వారి వ్యక్తిగత పరిష్కారం ద్వారానే సాధ్యమవు తుందని నమ్మిన వ్యక్తి. ఓల్గా మాత్రం స్త్రీ సమస్యలు స్త్రీశక్తి సంఘటన ద్వారానే పరిష్కారమవుతాయని నమ్ముతారు.


స్త్రీల జీవితాల్లో సగభాగం వంటింటికే అంకితం కావటం ఒక సామాజిక వాస్తవం. గడియ తీరిక, గవ్వ సంపాదన లేని బతుకంటూ విసుక్కునే అమ్మ, అమ్మమ్మలను చూడనివాళ్లు ఉండరేమో! ఆడపిల్ల జీవితాన్ని పెనవేసుకున్న వంటింటి నేపథ్యాన్ని స్త్రీవాద కవిత్వం ఓ కొత్త అవగాహనతో విశ్లేషించింది. ‘‘ఎంత అద్భుతమైందీ వంటగది’’ అంటూ మొదలై ‘‘ఇంట్లో అమ్మలంతా ఇక్కడే ‘స్త్రీ’లయ్యారట, / మా అమ్మకి చేతుల్లేవు/ ఈ వంటింటిని తగలెయ్య / ఎంత అమానుషమైందీ వంటగది!/ మన పిల్లల కోసం వంటరి వంట గదులు కూల్చేందుకు రండి’’ అన్న విమల కవితాగ్రహం సమంజసమైనదే!


ప్రపంచీకరణ ప్రభావం.. 

 1990 దశకం తర్వాత అన్ని సాహిత్య ధోరణులను తీవ్రంగా కలవరపెట్టిన అంశం ప్రపంచీకరణ. దీని ఫలితంగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ప్రత్యేకించి వివాహ వ్యవస్థ పునాదులను పెకిలించి వేసేలా సుఖలాలస భావనలకు బీజంపడింది. ప్రపంచీకరణ ఫలితంగా ఏర్పడిన వ్యాపార శైలి కుటుంబ సంబంధాల్లోని సహజమైన ప్రేమలను ఛిన్నాభిన్నం చేసింది. ఈ పరిస్థితుల్లో కొండేపూడి నిర్మల లాంటి వారు ‘మల్టీ నేషన్‌ ముద్దు’ పేరుతో కవిత్వాలు రాస్తే.. గీతాంజలి, కుప్పిలి పద్మ, పి.సత్యవతి, ఓల్గా, నల్లూరి రుక్మిణి తదితరులు ప్రపంచీకరణ ప్రభావంతో మానవ సంబంధాల మధ్య నలుగుతున్న మహిళల జీవితాలకు అద్దం పడుతూ రచనలు చేశారు. గీతాంజలి ‘ఊరికి పోదాం భూదేవి’, పి.సత్యవతి ‘ఇరుకు’ కథల్లో ప్రపంచీకరణతో ఏర్పడిన వస్తుసంస్కృతి, వ్యామోహాలు భార్యాభర్తల మైత్రీ బంధాన్ని శత్రుబంధంగా మార్చటమే కాక మనసులో అమానవీయ భావాలను పెంచుతున్నాయన్న రచయిత్రుల బాధ విశదమవుతుంది. కొండేపూడి నిర్మల చెప్పిన ‘‘వస్తువు బరువుకు మాట అగాధంలో పడిపోయిందనే’’ మాట నిజమనిపిస్తుంది. ప్రపంచీకరణ వివాహ అంతర్భాగ లైంగిక సంబంధాన్ని పాక్షికావ సరంగా, ఒత్తిడిని తట్టుకునే సంబంధంగా దిగజార్చింది. దీని ఆధారంగా కుప్పిలి పద్మ రాసిన ‘సాలభంజిక, ఆకాంక్ష’ కథలు చదువరులను ఆలోచింపచేస్తాయి. ఇవే కాదు, నల్లూరి రుక్మిణి రాసిన ‘పోగులు తెగిన అల్లిక, మాయ జలతారు’, ఓల్గా ‘కోకాకోలా’ తదితర రచనలు పితృస్వామ్య సంస్కృతి వల్ల ఇప్పటికే బాధితులైన మహిళలు, ప్రపంచీకరణ వల్ల ఏర్పడిన కొత్త సాంస్కృతిక దాడికి మరింతగా బాధితులవుతున్నారనే వాస్తవాన్ని తేటతెల్లం చేస్తాయి. వర్తమాన సమాజంలో స్త్రీ శరీరం డబ్బును ఆర్జించే వస్తువుగా మారుతున్న క్రమాన్ని ఓల్గా, కుప్పిలి పద్మ తదితరులు లోతుగా చర్చించారు.


స్త్రీవాద కవితా శరాలు 

స్త్రీల జీవితాల్లోని చీకటి కోణాలన్నింటిపై స్త్రీవాద సాహిత్యం తన ఆలోచనల వెలుతురును ప్రసరింపచేసింది. ‘‘పావలా నుంచీ పదివేల వరకైనా/ కరకు కాసుల్ని కామంతో తూచగలదాన్ని’’ అంటూ కాంక్షల పడగచాటు నుంచి అన్నమనే అమృతాన్ని ఆహ్వానిస్తున్న అమాయకపు స్త్రీమూర్తుల మీద ఘంటసాల నిర్మల రాసిన ‘ఏ కాల్‌ గర్ల్స్‌ మోనోలాగ్‌’ కవిత, మెహందీ స్త్రీల మీద ఓల్గా రాసిన కవితలు సాహిత్యంలో చర్చనీయాంశాలయ్యాయి. 

   పితృస్వామిక సమాజం పురుషుణ్ని మనసుతోను, స్త్రీని శరీరంతోనూ గుర్తిస్తూ, జత చేస్తూ వచ్చింది. అందుకే స్త్రీవాదులు ప్రధానంగా స్త్రీ శరీరాల మీద నియంత్రణ, అణచివేతలనే చర్చించారు. సుజాత తరం నుంచి మాత్రమే స్త్రీవాద భావజాలం వాస్తవికతా పునాదిపైన నిలబడటానికి ప్రయత్నించింది. ‘‘భార్యాభర్తల అనుబంధం, కలయికా హృదయాలు కలిస్తే ఒక మధురానుభూతి. ఇరువురి తనువులొకటైన అమృత ఘడియలలో ‘జీతమెప్పుడిస్తా రం’టూ? ప్రశ్నించిన భర్త ‘సర్ప పరిష్వంగం’లో జీవితం నుంచి కాదు కదా శరీరం నుంచైనా/ కించిత్తు కూడా దూరమవటం నా చేతుల్లో లేని పని/ క్షణక్షణం ఇలా రాజీపడుతూనే/ మృత్యు పర్యంతం బ్రతికేస్తూనే ఉంటాను’’ అంటూ స్త్రీల అసహాయతపై మందరపు హైమవతి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తను పుట్టి పెరిగిన పుట్టింటికి తనే అతిథిగా మారి వచ్చి ఇటుక ఇటుకలో బాల్యం తాలూకు ప్రేమస్మృతులను చూసుకునే ఆడపిల్ల జీవితంలో ప్రేమ రాహిత్యాన్ని ఎండకట్టారు వాణీ రంగారావు తన ‘తివాచీ’ కవితలో. ‘‘నాకింక బ్రతకాలని లేదురా అబ్బీ/ నిక్కరు తొడుక్కోవటం చేతకాని నీకు/ మాటను కూడా తొడిగి గుసగుసగా ‘అమ్మ’/ అనిపించుకున్న చెవులు/ ఎంత చేదెక్కిపోయాయిరా’’ అంటూ తనను వదిలించుకోజూసిన తనయుడి మీద తల్లి ఆక్రోశాన్ని ‘మదర్‌ సీరియస్‌’లో కొండేపూడి నిర్మల వెలికి తీశారు. స్త్రీని వ్యక్తిత్వమున్న మనిషిగా చూడకుండా, ఇంటి అవసరాలు తీర్చే పనిముట్టుగా మార్చిన కుటుంబ వ్యవస్థ మీద స్త్రీవాద కవిత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఓల్గా ‘గృహలక్ష్మి’ కవితలో ఈ అధిక్షేపణ కనిపిస్తుంది.    


సుదీర్ఘ పదజాలం లేకున్నా సూటిగా భావాన్ని చేరవేయగలిగే సామర్థ్యమున్న మినీ కవితల్లోనూ స్త్రీవాదం తొంగి చూసింది. ‘‘తనువు పుండై/ నలుగురికి పండై/ తాను శవమై/ నలుగురికి వశమై/’’ అంటూ వేశ్యల జీవన విషాదాలను కళ్లకు కట్టారు అలిశెట్టి ప్రభాకర్‌. ‘‘నీ చేతుల్లో పడక ముందే స్వేచ్ఛగా/ మల్లె తీగలా ఎదిగాను/ నీ చేతుల్లో పడ్డాక బోన్సాయ్‌/ మొక్కని అయిపోయాను/’’ అంటూ పురుషాధిక్య సమాజం మీద వ్యంగ్యాస్త్రాలను సంధించారు కవి చల్లా రామఫణి. అయితే, తొంభైలు ప్రధానంగా మూడు బలమైన వచన కవితోద్యమాలని ముందుకు తీసుకు వచ్చాయి. వాటిలో మొదటిది స్త్రీ వాద కవిత కాగా తక్కినవి మైనారిటీ, దళిత వాదాలు. కొండేపూడి నిర్మల ‘నడిచే గాయాలు, బాధాశప్తనది’, విమల ‘అడవి ఉప్పొంగిన రాత్రి’, జయప్రభ ‘ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది’, మహెజబీన్‌ ‘ఆకురాలు కాలం’, శిలాలోలిత ‘పంజరాన్ని నేనే, పక్షిని నేనే’ లాంటి వచన కవితలు స్త్రీవాద తీవ్రతను ప్రస్ఫుటింపచేశాయి. వచన కవితా ప్రస్థానంలో పఠాభి, దిగంబర కవులు ఎంత దూషణని, తిరస్కారాన్ని ఎదుర్కొన్నారో, స్త్రీవాద కవులు కూడా అంతే తీవ్రతను ఎదుర్కొన్నారు. ‘‘ప్రపంచంలోని నరకమో/ నరకంలోని ప్రపంచమో/ త్రీడీలో చూస్తున్నట్టే ఉంటుందం’’టూ సాగిన కె.నిర్మల ‘లేబర్‌రూమ్‌’ కవిత తీవ్ర వివాదాలకు కారణమైంది. స్త్రీ సహజమైన శారీరక ధర్మాలను, అవస్థలను కవిత్వీకరించటం వల్ల ఒరిగే ప్రయోజనాల గురించి విమర్శకులు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ‘లేబర్‌రూమ్‌’ కవిత స్త్రీల మనోధైర్యానికి, భావ ప్రకటనా స్వేచ్ఛా కాంక్షకు మచ్చుతునక. ‘‘ప్రేమో.. తాపమో.. కోరికో.. /తడి లేకుండా పోవడానికి ఎడారులం కాదుగా’’ అంటూ స్త్రీలకూ హృదయముంటుంది, కోరికలుంటాయి అనే విషయాన్ని మరిచి ఈ పురుషస్వామ్యపు సమాజం స్త్రీలని, ముఖ్యంగా ముస్లిం స్త్రీలను అన్ని రకాలుగా అణగదొక్కుతోందని వాపోతారు కవయిత్రి షాజహానా. ఇక అందరూ ‘మామూలు విషయాలు’ అనుకునే వాటిని కూడా అద్భుతమైన కవితా వస్తువులుగా మార్చవచ్చని నిరూపించిన కవి ఎండ్లూరి సుధాకర్‌. పొద్దున్నే రోడ్లూడ్చే దళిత మహిళ ‘మైసమ్మ మరణమే’ ఇతివృత్తంగా ఆయన రాసిన కవిత విశిష్టమైంది.   

ఎందరో దీపధారులు!

గోపి భాగ్యలక్ష్మి రాసిన ‘జంగూబాయి’ (1993) కథ యువతరం సాధించిన పరిణతికి ఒక ప్రతీక. జెండర్‌ అనేది కుల, వర్గ, జాతి ప్రాతిపదికల కంటే భిన్నంగా పరిశీలించాల్సిన అంశమని, స్త్రీలు బానిసలకు బానిసలు కాకూడదనే బాధ ఆ కథ చెబుతుంది. రంగనాయకమ్మ ప్రభావంతో సావిత్రి రాసిన కథ నుంచి, ఓల్గా మీదుగా భాగ్యలక్ష్మి వరకు వచ్చేసరికి దశాబ్దకాల వ్యవధిలో రచయిత్రులు తమ అవగాహనను, జీవన దృక్పథాన్ని విస్తృతపరచుకున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ‘‘జీవితంలోని అసంబద్ధతను చట్టము, సిద్ధాంతమూ కూడా పరిష్కరించలేని నేపథ్యంలో సంస్కారమే ఆ పని చెయ్యటం, అలాంటి సంస్కారాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేయటమే మంచిని పెంచడ’’మన్నారు గురజాడ. వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘కొండ ఫలం’ (1999) కథ ఇలాంటి మంచిని పెంచే ప్రయత్నమే! ‘వెన్నెల ముగ్గు’ (1980) కథతో రంగ ప్రవేశం చేసిన ఈవిడ తన తొలి కథల్లోనే స్త్రీ సమస్య ఆర్థిక స్వాతంత్య్రంతో పరిష్కారమయ్యేది కాదనీ, ఆర్థిక స్వాతంత్య్రం తర్వాత ఆమె సమస్య మరింత జటిలమవుతుందన్నారు.

   కుటుంబ హద్దులను చెరిపి బయటకు అడుగుపెట్టిన మహిళల సంక్షిప్త గాథల సంపుటి అబ్బూరి ఛాయాదేవి ‘తన మార్గం’. కుటుంబాల కోసం మహిళలు గడిపే యాంత్రిక జీవితాల గురించి రాసిన ‘బోన్సాయ్‌ బతుకులు’, రోగాల పాలైన వేశ్యల కథలతో గోరా సరస్వతి రాసిన ‘రక్త పంకం’ నవలలు నిజమేననిపిస్తాయి. పీడక సమాజానికి ప్రాతినిధ్యం వహించే వాళ్లు ఎవరైనా వారి పాలక వర్గ స్వభావం, వారి లింగ స్వభావాన్ని మరుగు పరుస్తుందని పాఠకుల దృష్టికి తెచ్చే కథల్లో తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘పనిపిల్ల’ (1994) ఒకటి. వేధింపులు, వివక్షలు తెలంగాణ స్త్రీల బతుకులను ఎంత దుర్భరం చేస్తున్నాయో ‘విసుర్రాయి, మింగుతున్న పట్నం’ కథాసంపుటాల ద్వారా చూపించారు ముదిగంటి సుజాతారెడ్డి. ‘ఆకాశంలో విభజన రేఖల్లేవు, సంకెళ్లు తెగాయి’ లాంటి నవలా రచనలూ చేశారావిడ. స్త్రీల జీవితాలను అన్ని కోణాల్లోంచి పరిశీలించి, విశ్లేషించి సమస్యలను గుర్తించటమే కాదు, పరిష్కారాలనూ సూచించిన రచయిత్రి సి.సుజాత. ‘రెప్పచాటు ఉప్పెన, సప్త భుజంగాలు’ కథలతో ఆవిడ సాహితీ ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించు కోగలిగారు. ‘నెరుసు’ కథా సంపుటి, ‘రాతిపూలు’ నవలలతో పరిపూర్ణ స్త్రీవాద రచయిత్రిగా తన విశ్వరూపాన్ని చూపించారు. సుజాత పాత్రలు సంక్లిష్ట సందర్భాల్లో నైరాశ్యానికి లోను కావు. పరిస్థితులను అర్థం చేసుకుని, స్వీయ చైతన్యంతో ప్రవర్తిస్తాయి. సహజీవనం, లెస్బియన్, ఒంటరి స్త్రీలు లాంటి ప్రత్యామ్నాయ భావనలను సుజాత తన ‘బీటెన్‌ ట్రాక్, చందన, నా దారిలోనే’ కథల్లో ప్రస్తావించారు.  

సమకాలీన స్త్రీవాద గళాలు 

2000- 2010 దశాబ్దంలో స్త్రీవాద కవిత్వ చైతన్యంతో కె.గీత ‘ద్రవభాష’, ఘంటసాల నిర్మల ‘నిర్వచనం’, మందరపు హైమవతి ‘నిషిద్ధాక్షరి’, సుజాత పట్వారి ‘పుప్పొడి’, విమల ‘మృగన’లతో పాటు దళిత స్త్రీవాద చైతన్యంతో చల్లపల్లి స్వరూపారాణి ‘మంకెన పువ్వు’, ముస్లిం స్త్రీవాద చైతన్యంతో షాజహానా ‘నఖాబ్‌’ వెలువరించారు. నదిలోకి పాత నీరు వెళ్లి కొత్త నీరు చేరినట్టే, కథావాహినిలోకీ కొత్త రచనలు వచ్చి చేరుతాయి. తమ వైపు దృష్టి సారించుకునేలా చేస్తాయి. జాతి వైరాలు, వివక్షలు, స్వేచ్ఛ కోసం ఉద్యమాలు, విఫల ప్రేమలు, పెద్దరికాలకు తలొగ్గటాలు, అత్యాచారాలు, మనసు లేని మానవులు, బలవంతపు అనుబంధాల్లాంటి అంశాల్లో ఇంకా లోతుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు గొప్ప అన్వేషణతో కూడిన రచయితలు ముందడుగు వేస్తారు. అలాంటి కథకుల్లో పాలగిరి విశ్వప్రసాద్, రాధిక, కల్పనా రెంటాల లాంటి వారిని ఉదాహరించవచ్చు.

స్త్రీ ప్రవర్తన మీద ఆంక్షలు, నియమాలు, నిర్బంధాల మధ్య ఆధునిక మహిళ వాటిని ధిక్కరిస్తూ స్వేచ్ఛను కోరుకుంటోంది. తనదైన ప్రపంచంలో బయటి ప్రపంచానికి తావు లేదంటోంది. తన సంబంధాలు ఎవరితోనైనా, ఎలాంటివైనా అవి పూర్తిగా తన వ్యక్తిగతంగా భావిస్తోంది. స్త్త్ర్రీ-స్త్రీ సంబంధం కూడా స్త్రీ స్వేచ్ఛలో భాగమే కనుక అది వ్యక్తిగతం అయినంతవరకు దాన్ని ఎవరూ నిషేధించకూడదని హక్కుల వేదికలు పోరాడుతున్నాయి. ఇలాంటి సన్నివేశాన్ని ‘ది కప్లెట్‌’ కథలో కల్పనా రెంటాల హృద్యంగా చిత్రించారు. ‘మనుషులకు అన్ని రకాల స్వేచ్ఛలూ ఉండాలి, అదే అంతిమ విలువ’ అనే ఆధునిక భావనలో స్త్రీ పురుషుల సహజీవనం ఒక సహజ పరిణామంగా ముందుకు వస్తున్నా, అక్కడా స్త్రీ పురుష సమానత్వం కనబడట్లేదు. ఇలా ఆలోచించే స్త్రీ మనోభావనలను, స్వేచ్ఛాపిపాసను లోతుగా వివరించిన కథ.. కేఎన్‌ మల్లీశ్వరి ‘శతపత్రసుందరి’. మరోవైపు.. ప్రలోభాలకు లొంగి బలైపోతున్న స్త్రీల పరిస్థితిని పాలగిరి విశ్వప్రసాద్‌ ‘ఆకులు రాల్చిన కాలం’ కళ్లకు కట్టింది.

   నేటి స్త్రీ జీవితం అధునాతనమైనా, రకరకాల వ్యూహాల మధ్య పురుషుడి చెప్పుచేతల్లోనే ఉంది. ఆర్థిక స్వాతంత్య్రంతో పాటు తన నిర్ణయాలు తానే తీసుకోవాలనుకునే మహిళ, సమాజ నిబంధనలకు, స్వీయ నియంత్రణకు మధ్య నలిగిపోతోంది. అయితే సంక్లిష్ట పరిస్థితుల్లో వెనకడుగు వేసినా నిర్ణాయక స్వేచ్ఛ తీసుకునే దృఢ మహిళలు కిరణ్మయి, ప్రవల్లికలు మధురాంతకం నరేంద్ర ‘నిశ్శబ్దపు చప్పుడు’, యాజీ రాసిన ‘ప్రవల్లిక నిర్ణయం’ కథల్లో కనిపిస్తారు. అయితే కోస్తాంధ్ర స్త్రీ సమస్యలు తెలంగాణ స్త్రీ సమస్యలు ఒకటి కావని ‘అస్మిత’ సంస్థ ప్రచురించిన ‘మహిళావరణం’ అనే బృహద్గ్రంథం స్పష్టం చేస్తుంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల స్త్రీల బాధలు చెప్పుకునేందుకు ఈ ప్రాంతాల నుంచి రచయిత్రులు మరింత ఎక్కువగా రావాలి.

   మొత్తానికి నేటి స్త్రీవాదం సహజీవనం - వాస్తవిక పరిస్థితులు, బలాత్కారానికి గురైన మహిళల మనోస్థితి, సమాజం స్పందించే తీరు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యతలో మార్పు, తద్వారా సమాజంలో మార్పు, వివాహం అందించే ఉద్వేగ స్థిరత్వం - వివాహేతర ప్రత్యామ్నాయ భావనల వల్ల కలిగే పరిణామాలు, కుటుంబం నుంచి సమాజం వరకు స్త్రీ ఎదుగుదలలో పురుషుల పాత్ర- బాధ్యతల మీద దృష్టిసారిస్తోంది. ఆధునిక మహిళ లైంగిక కట్టుబాట్ల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. మూస ధోరణులకు స్వస్తి పలికే సమయం కోసం వేచిచూస్తోంది. ప్రకృతిలో స్త్రీ, పురుషులిద్దరూ సమానమే. ఒకరికొకరు అవసరమే. ఇలాంటి సంయమనంతో వ్యవహరిస్తే ఎలాంటి ఘర్షణ లేని ప్రశాంత వాతావరణం వెల్లివిరుస్తుంది. ఆ రోజు కోసం సమస్త నారీలోకం ఎదురుచూస్తోంది.


- అపర్ణ


Report Page